Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

రుయా మృతులు: NHRCకి 45 మంది జాబితా.. అందజేసిన మాజీ కేంద్ర మంత్రి!

తిరుపతి రుయా ఆస్పత్రిలో మే 10న కొద్దిసేపు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత 11 మంది చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించగా.. రెండు రోజుల కిందట 23 మందికి పరిహారం చెల్లించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చూపుతోందని ప్రతిపక్షాలు విమర్శించిన తెలిసిందే. తాజాగా, రుయాలో ఆక్సిజన్ అందక చనిపోయిన కొవిడ్‌ బాధితులందరికీ రూ.10ది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. ఆక్సిజన్‌ అందక రుయా ఆస్పత్రిలో 45 మంది చనిపోయారంటూ.. వారి పేర్లు, చిరునామాలతో కూడిన జాబితాను ఆయన శనివారం విడుదల చేశారు. ఈ జాబితాను జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు పంపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే మాజీ ఎంపీ చింతా మోహన్‌ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి గవర్నర్‌కు లేఖ రాయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొత్తగా మరో 12 మందికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల నిధులను విడుదల చేసింది. అయితే, ఆ రోజు ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయారని, దాని ప్రభావం వల్ల తర్వాత మరికొందరు మృతిచెందారని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి తెలిపారు. వారి వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్ కోరడంతో మరో 12 మంది వివరాలు అందజేశామని వెల్లడించారు. రుయా అధికారులు ఇచ్చిన నివేదిక అనుసరించి కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఆరుగురికి చెక్కులను పంపిణీ చేశారు. తాజాగా, డాక్టర్ వెల్లడించిన జాబితాలో 45 మంది ఉండటం గమనార్హం. వారి పేర్లు, చిరునామాలతో సహా అన్ని వివరాలను పేర్కొన్నారు. మృతులు 11 మంది కాదని.. ఆ సంఖ్య ఎక్కువని తాము ముందు నుంచే చెబుతున్నా ప్రభుత్వం దబాయిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తొలుత 11 మందిని చెప్పి.. 23 మందికి పరిహారం ఇవ్వడంతో తాము చెప్పిందే నిజమైందని విపక్ష పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu