తెలుగు అకాడమీ స్కామ్ లో ప్రమేయం ఉన్న నిందితులపై పోలీసులు సస్పెక్ట్ షీట్స్ నమోదు చేయాలని నిర్ణయించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్‌లో కోట్ల అవినీతి జరిగింది. ఈ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉంది. రెండు రాష్ట్రాలకు చెందిన ఎఫ్‌డీలను నిందితులు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి విత్ డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇందులో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితులైన చుండూరి వెంకట కోటి సాయికుమార్, వెంకట రమణ, సోమశేఖర్‌లతో పాటు మరి కొందరిపై పోలీసులు సస్పెక్ట్ షీట్స్ నమోదు చేయాలని భావిస్తున్నారు.
ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్న నిందితులు ఇలాంటి స్కామ్స్ 2015 నుంచే చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా ఒక్క రాష్ట్రానికి చెందిన వారు కాకపోవడం, వీరికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడమే ఇలాంటి స్కామ్ లకు కారణమవుతోందని పోలీసులు భావిస్తున్నారు. వీరు కొన్ని సందర్భాల్లో అరెస్టు అయినా కూడా బెయిల్ పై వచ్చి మళ్లీ అదే తరహాలో స్కామ్స్ నిర్వహిస్తున్నారు. దీనికి కారణం వీరిపై పోలీసు నిఘా లేకపోవడమే అని సీపీఎస్ పోలీసులు నిర్ణయించారు. అందుకే వీరిపై సస్పెక్ట్ షీట్ తెరిస్తే మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉండదని అనుకుంటున్నారు.
సస్పెక్ట్ షీట్స్ అంటే ఏమిటి ? తెలుగు అకాడమీ స్కామ్‌లో ప్రమేయం ఉన్న వారిపై సస్పెక్ట్ షీట్ నమోదు చేయబోతున్నారు. అయితే చాలా మందికి ఈ సస్పెక్ట్ షీట్ అంటే ఏమిటనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రౌడీ షీట్, హిస్టరీ షీట్, కమ్యూనల్ షీట్, గ్రామర్ షీట్స్ అనేవి ఎన్నో ఏళ్లుగా అందరికీ తెలిసిన పదాలు. కానీ ఈ సస్పెక్ట్ షీట్ అంటే ఎక్కువ మందికి అవగాహన లేదు. ఎలాంటి నేరాల చరిత్ర రికార్డ్‌లో ఉండకుండా ఒకే తరహాలో నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లపై సస్పెక్ట్ షీట్స్‌ను తెరుస్తుంటారు. ఇప్పటి వరకు ఉన్న చట్టాల పరిధిలో పలు చిన్న చిన్న మార్పులు తెస్తూ సీపీఎస్ పోలీసులు ఈ షీట్స్‌ను తెరుస్తున్నారు. ఇందులో నేరస్తుడి అన్ని వివరాలు పొందుపరుస్తారు. నిందితుడి ఫొటో, అతడి అడ్రెస్, ఇంత వరకు అతడిపై నమోదై ఉన్న కేసులు, ఎలా నేరం చేస్తుంటాడు వంటి వివరాలు అందులో చేరుస్తున్నారు. వీటిని నిందితుడు నివసిస్తున్న ప్రాంతంలో ఉండే పోలీసు స్టేషన్‌కు పంపిస్తారు. అక్కడి పోలీసు స్టేషన్ లో ఈ వివరాలు అన్ని పొందుపరుస్తారు. ఇలా చేయడం వల్ల ఆయా పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్స్ జరిగినప్పుడు, కొత్త ఆఫీసర్స్ వచ్చినప్పుడు వీరి కదలికలను అంచనా వేయడానికి ఈ షీట్స్ ఉపయోగపడుతాయి.
వీటితో పాటు పోలీసు పెట్రోలింగ్ ఆఫీసర్లు, ఇతర పోలీసుల ఆఫీసర్లు వీరిపై నిఘా వేస్తారు. ఎప్పటికప్పుడు వీరు చేస్తున్న కార్యకలాపాలను గమనిస్తుంటారు ఇంటికి కూడా వెళ్తూ పరిశీలిస్తుంటారు. ఇలా చేయడం వల్ల నిందితులు మళ్లీ ఇలాంటి పనులు చేయడానికి వెనకడుగు వేస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సస్పెక్ట్ షీట్స్‌ను ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎస్పీ ఆఫీసులకు కూడా పంపిస్తారు. ఆయా జిల్లాల అధికారులను ఈ నిందితులపై నిఘా ఉంచాల్సిందిగా కోరుతారు.
0 Comments