*పట్టణ ప్రాంత ప్రజలపై పన్నుల భారం మోపటం తగదు*
196,197 ఉత్తర్వులు రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజలపై పన్ను భారాలను పెంచేందుకు ఉద్దేశించిన మున్సిపల్ చట్టం ఆర్డినెన్సును తక్షణమే రద్దు చేయాలని, ప్రజలపై భారాలు మోపకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ఏడో వార్డు సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ
కరోనా సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు ఎన్నడూ లేనంతగా పతనమయ్యాయని, ఈ దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల ఆర్ధిక పరిపుష్టికి అనేక రూపాల్లో చేయూతనందిస్తున్నాయని తెలిపారు. కాని ఏపీలో ప్రజలపై పన్ను భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్దమవ్వటం బాధాకరమన్నారు.
తమది సంక్షేమ ప్రభుత్వం అంటూనే మరోవైపు పన్నుల మోత మోగించి ప్రజల జేబులు గుల్ల చేసేందుకు సమాయత్తమవటం ఆందోళనకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 196, 197, మున్సిపల్ చట్ట ఆర్డినెన్సుల ద్వారా పట్టణ ప్రాంతాల్లో నివశించే 1.60 కోట్ల మంది ప్రజలను పన్ను పోటుకు గురి చేసి ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు ఈ జీవోలు ఉద్దేశించబడ్డాయని ఆరోపించారు. ఆస్తులపై 15 శాతం పన్ను పెంపు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ చార్జీలను ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసేందుకు సిద్ధమవటం సమంజసం కాదన్నారు. పన్ను వసూళ్లను కఠినతరం చేయటం, పన్నులు చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసేందుకు నిర్ణయించటం మరింత ఆందోళనకు గురిచేసే అంశంమని వివరించారు. రాష్ట్ర మంత్రులు కేవలం 15 శాతం మాత్రమే పన్నులు పెంచుతామంటూ చెబుతున్న మాటల్లో కూడా వాస్తవం లేదని, మార్కెట్ ధరల ప్రకారం పన్ను నిర్ణయిస్తే ఇప్పుడున్న పన్నులు ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. ఇందువల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రజల ఆదాయ వ్యయాలు పన్నుల భారం కారణంగా దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. పొరుగురాష్ట్రం తెలంగాణలో పన్నుల్లో 50 శాతం రాయితీ కల్పించారని, మరెన్నో రాష్ట్రాలు ప్రజలకు పన్ను రాయితీలు కల్పిస్తుండగా , వైసీపీ ప్రభుత్వం మాత్రం పన్నులతో ప్రజలను పీడించేందుకు సమాయత్తమవటం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పన్నులు పెంచాల్సి వస్తుందని చెప్పటం సరికాదన్నారు. మోడి ప్రభుత్వం చెప్పినంత మాత్రాన ప్రజల్ని పీడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం తగదన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరి అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయటం లేదని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కాని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తం అవటం ఖాయమన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు పోపూరి సుబ్బారావు, నాయకులు సాతులూరి బాబు, లూథర్, జేమ్స్, షేక్ ఫైరోజ్, కె సుబ్బారావు పాల్గొన్నారు.
0 Comments